ఒకనాడు దత్తాత్రేయులవారు అరణ్యములో తిరుగుచుండగా యదుమహారాజు దత్తాత్రేయులవారిని చూస్తారు. సర్వము పరిత్యజించి నిత్యహాసితవదనుడై బ్రహ్మవర్చస్సుతో శోభిస్తున్నదత్తాత్రేయులవారిని చూచి "మహాత్మా! తమరింత ఆనందముగా మనుగడను సాగించుటలోగల రహస్యమేమి? ఈ స్థితిని తమకు ప్రసాదించిన సద్గురువు ఎవరు?" అని ప్రశ్నిస్తారు.
దత్తాత్రేయులవారు చిరునవ్వుతో "నా ఆత్మయే నాకు గురువు. ప్రకృతిలో నా పరిశీలన ద్వారా తత్వాన్ని గ్రహించాను. నేను సముపార్జించిన జ్ఞానము ఇరువది నలుగురు ద్వారా నాకు కలిగినది. ఆ ఇరవై నలుగురే నాకు గురువులు" అని తెలియజేస్తారు. యదుమహారాజుకు కుతూహలం కలుగుతుంది. వారెవరో తెలియజేయవలసినది గా దత్తాత్రేయులవారిని ప్రార్థిస్తారు. యదుమహారాజు కోర్కెపై తన ఇరువది నలుగురు గురువులను, వారి ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని తెలియజేస్తారు.
1. తనను జీవులు ఎన్ని విధాలుగా హింసిస్తున్ననూ, త్రొక్కుతున్నను, తనపై మలమూత్రములు విసర్జించు చున్ననూ, అన్నిటినీ భరించి ద్వేషభావము లేక హింసించిన వారికి ప్రతిఫలంగా పంటలను, ఫల వృక్షములను, లతాపుష్పములను, పూలతెనేలను ప్రసాదిస్తున్న భూదేవినుండి సహనాన్ని, భూతదయను నేర్చుకున్నాను.
2. పరిశుద్ధమైన జలము మురికిని పోగొట్టునట్లు అంతఃకరణశుద్ధి గల మహాత్ములు ప్రాపంచిక మానవుల మనోమాలిన్యాన్ని శుభ్రపరుస్తారు. నేను పరిశుద్ధ అంతఃకరణ కలిగి జీవించాలని నీటిద్వారా పాఠము నేర్చుకున్నాను .
3. గాలి అన్నిచోట్ల తిరిగినను, ఎన్నో వస్తువులపై ప్రయాణము సాగించినాను దేనితోను సంగత్వం ఏర్పరచుకోని విధంగా ప్రపంచములో ఎవరిమధ్య తిరుగుచున్నను నిస్సంగుడనై జీవించాలని గాలిని చూచి గ్రహించాను.
4. తమ బిడ్డలతో కలసి ఎంతో హాయిగా జీవిస్తున్నపావురముల జంటను ఒకసారి నేను చూసాను. కొంత సేపటికి అక్కడికి ఒక బోయవాడు వచ్చి వల పన్నాడు. వెంటనే కపోత సంతానము ఆ వల లోనికి వెళ్లి చిక్కిపోయినవి. బిడ్డలను వదిలి జీవించలేని తల్లిపావురము విలపిస్తూ పరుగెత్తి తనూ వెళ్లి వలలో చిక్కిపోయింది. వ్యామోహ మమకారాదులే బంధానికి కారణమని ఆ కపోతముల ద్వారా గ్రహించాను.
5. తుమ్మెద ఒక పుష్పము నుండి గాక అనేక పుష్పాల మకరందమును గ్రహించులాగున, యతినైన నేను ఒక ఇంటి నుండి గాక కొన్ని ఇళ్ళకు భిక్షకు వెళ్లి గ్రహించిన దానితో తృప్తిజెంది జీవించాలని, ఒక ఇంటిలోనే వుండి గృహస్తులకు భారం కారాదని తుమ్మెద ద్వారా గ్రహించాను. దీనినే ‘మధుకరి భిక్ష’ అంటారు.
6. తేనెటీగలు అతి కష్టంతో తేనెను సంపాదిస్తాయి. బోయవాడు అతిసులభంగా తేనెను అపహరిస్తాడు. మానవుడు అతికష్టంతో ధనాన్నిసంపాదించి దాచుకుంటాడు. మృత్యువు ఒక క్షణంలో హరించి వేస్తుంది. మనం దాచుకున్నది యముడు దోచుకోవడానికే గనుక, ధనమును దాచుట మంచిది కాదని తేనెటీగలను చూచి గ్రహించాను.
7. పాలుత్రాగే శిశువు ఏ వ్యధలు లేక అలజడులు లేక సదా ఆనందంగా జీవిస్తుంది. సాధకుడు కూడా అహంకార అభిమాన రహితుడై పసిబిడ్డలాగా కాలం గడపాలని శిశువు ద్వారా గ్రహించాను.
8. తాను నివసించడానికి పాము పుట్టను నిర్మించుకోదు. చీమలు ఇత్యాది కీటకములు తయారుచేసిన పుట్టలో మనుగడను సాగిస్తుంది. సన్యాసి తనకొరకు ఆశ్రమాలు నిర్మించుకోనవసరం లేదని ఇతరులు నిర్మించిన గుహలలో, దేవాలయాలలో నివసించడమే ధర్మయుతమని పామును చూసి తెలుసుకున్నాను.
9. అగ్ని ఎలా ప్రకాశిస్తుందో అలాగే తపోజ్ఞానాలతో యతి ప్రకాశించాలని అగ్నిద్వారా తెలుసుకున్నాను.
10. సాలెపురుగు తాను నిర్మించుకున్న సాలెగూటిలో తానే చిక్కి గతించిపోతుంది. అలాగే మనిషి తన మనో భావాలనే విషవలయంలో చిక్కి నశించిపోతడు. కనుక ప్రజ్ఞావంతుడు ప్రాపంచిక విషయవాసనలనేది కట్టెలతో పేర్చబడిన జీవనచితిపై మృతి చెందరాదని సాలెపురుగు ద్వారా గ్రహించాను.
11. విదేహనగరంలో పింగళ అనే నర్తకి ఉండేది. తన నృత్య విన్యాసాన్నికాంక్షించే పురుషుల ఎదుట నృత్యంచేస్తూ జీవిస్తుండేది. ఒకనాడు తన నృత్య ప్రదర్శనలలో పాల్గొని పాలుపంచుకునేవారు ఒక్కరు కూడా రాలేదు. ఆవిడ కొంతసేపు అలాగే నిరీక్షించి నిరాశ చెందింది. ఇక ఎవ్వరురారని నిర్ణయించుకున్నది. ఉన్నదానితో తృప్తిపడి గృహంలోనికి వెళ్లి హాయిగా నిద్రపోయింది. ఆశ వదిలిన వ్యక్తికి ఆనందం కలుగుతుందని ఆ నర్తకిని చూసి గ్రహించాను.
12. కొండచిలువ తాను ఆహార సంపాదనకి అలమటించి అలసిపోదు. తాను నిలకడగా ఒకచోట యుంటూ దొరికిన దానితో తృప్తిచెంది జీవిస్తుంది. ఆహారము కొరకు అన్వేషించక "యద్రుచ్చాలాభ సంతుష్టః’’ అయాచితముగా లభించిన దానితో జీవించాలని కొండచిలువని చూసి నేర్చుకున్నాను.
13. జిహ్వేంద్రియానికి బానిస అయిన చేప గాలానికి తగులుకున్న ఎరను మ్రింగాలని ప్రయత్నించి తానె ఆహుతి అయిపోతుంది. రుచి విషయంలో అభిరుచి మంచిది కాదు. దేహరక్షణ నిమిత్తం అవసరమైన ఆహారాన్ని సాధకుడు గ్రహించాలి. ఆహార విషయంలో అత్యాశ అనర్థాన్ని తెచ్చి పెడుతుందని చేపద్వారా గ్రహించాను.
14. గాలి, మేఘము, సూర్య చంద్ర నక్షత్రాదులు సర్వము ఆకాశములో ఉన్నాను వాటితో ఎలాంటి సంగత్వమును ఏర్పరచుకోకుండా నిలిచే ఆకాశమువలె ఆత్మా సర్వత్రా వ్యాపించినాను, సర్వము ఆత్మయందె ఉన్నాను ఏ వస్తువు తోనను సంబంధము, సంగత్వము ఆత్మకు లేదనే సత్యాన్ని ఆకాశం ద్వారా గ్రహించాను.
15. చంద్రుడు సదా పూర్ణుడై యున్ననూ భూమి చాయ చంద్రునిపై బడు రీతిని బట్టి చంద్రునిలో వృద్ధి క్షయాలు ఉన్నట్లు ఆరోపించు లాగున ఆత్మ అనంతము, సంపూర్ణము అయినను శరీర మనోబుద్దుల చాయా ప్రసరణచే ఆత్మ పరిమితిచే భ్రాంతి కలుగు చున్నదను చంద్రున్ని చూచి తెలుసుకున్నాను.
16. ఎన్నో నదులు తనలో వచ్చి కలసినను తాను ఎట్టి కలత చెందని సాగరము వలె జీవితములో బాధల్ని, వ్యధలూ, దుఃఖము - ఎన్ని ప్రవేశించు చున్నను చలించకుండా జీవించాలనే జ్ఞానాన్ని తెలుసుకున్నాను.
17. దీపకాంతిని చూసి భ్రాంతిలో పరుగిడి అగ్నికి ఆహుతై మాడిపోయే చిమ్మట పురుగు లాగ, స్త్రీ దేహ సౌందర్యాన్ని చూసి భ్రాంతితో మానవుడు ప్రసస్తమయిన జీవితాన్ని వృధా చేసుకోనుచున్నాడు. నేత్రెంద్రియమును నిగ్రహించుకొని మనసును మోహమునకు గురికానివ్వక ఆత్మ యందు లయం చేసినప్పుడు నిత్య శాంతి చెకూర గలదని చిమ్మట పురుగుని చూసి గ్రహించాను.
18. సూర్యుడు ఒకడే అయినను అనేక కుండల్లో ప్రతిబింబించి అనేక సుర్యులుగా కన్పట్టు లాగున, పరబ్రహ్మము శరీరములనే కుండలయండు మనసనే జలములో ప్రతిబింబించగానే అనేక అత్మలున్నట్లు తెలియుచున్నది. యథార్థానికి ఆత్మ ఒక్కటే అనే జ్ఞానం సూర్యుని చూసి గ్రహించాను.
19. సంగీతమంటే లేడికి చాలా అభిరుచి. అది తెలిసిన వేట గాడు ఒక పొదలో దాగి శ్రావ్యంగా వాద్య సంగీతాన్ని వినిపిస్తాడు. సంగీతము వినిపించు దిక్కునకే లేడి అభిలాషతో నడచి వస్తుంది. దగ్గరకు రాగానే వేటగాడు వలపన్ని పట్టుకుంటాడు. శబ్దేన్ద్రియమునకు లొంగి లేడి ప్రాణము పోగొట్టుకోను విధముగా , స్త్రీ యొక్క మృదు మధుర భాషనమనే సంగీతము విని పురుషుడు అన్యాయమై పోతున్నాడు. స్త్రీల విషయంలో శ్రవణము కూడా అపాయమే నని లేడి ద్వారా గ్రహించాను.
20. ఏనుగు రుతుకాలంలో ఎదుట ఉంచబడిన బొమ్మ ఏనుగును చూసి కామోద్రేకముతో ముందుకు సాగుతుంది. దానిని బంధించడానికి ముందే తయారు చేయబడిన గుంటలో పది దొరికిపోతుంది. స్త్రీ సంబంధమైన కామ వ్యామోహము మనిషికి పతనాన్ని కలిగిస్తుందని ఏనుగు ద్వారా గ్రహించాను.
21. కాకి ఒక చోట మాంసపు ముక్కను సంపాదించినది. అది చుసిన ఇతర పక్షులు దానిని వేమ్బదించాయి . ఎగిరి ఎగిరి కాకి అలసి పోతుంది. వెంబడించిన వస్తున్న పక్షుల బారినుండి తప్పించుకోలేక ఆ మాంసపు ముక్కను వదిలేస్తుంది. పక్షులన్నీ కాకిని వదిలి ఆ ముక్కను గ్రహించడానికి వేటాడాయి. కాకి ప్రశాంతంగా చెట్టుకొమ్మపై కూర్చొని సేద తీర్చుకుంటుంది. ఇంద్రియ విషయాలను పట్టుకున్నంత వరకు జీవికి దారుణమైన దుఖమేనని వాటిని త్యజించడం వలన ప్రశాంతత చేకూరుతుందని ఆ కాకిని చూసి నేర్చుకున్నాను.
22. ఒక శ్రామికుడు తన దుకాణం వద్ద శరములను తదేక దృష్టితో పదును చేస్తుంటాడు. అదే సమయానికి రాజు గారు సపరివార సమేతముగా తన దుకాణం ముందుగా వెడతారు. ఆ దృశ్యాన్ని శ్రామికుడు చూడలేదు. కొంత సేపటికి ఒక వ్యక్తి వచ్చి "రాజు గారు ఇటు వెళ్ళరా " అని అడుగుతాడు. "ఏమో నాకు తెలియదు, నేను బాణము చేయుటలో నిమగ్నమై ఉండినాను" అని సమాధాన మిస్తాడు. ఏకాగ్రత అంటే ఏమిటో అది ఎలా ఉండాలో ఆ శ్రామికుని చూచి గ్రహించాను.
23. వివాహ నిమిత్తమై అమ్మాయిని చూడటానికి ఒక ఇంటికి బంధువులు వస్తారు. ఆ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు లేరు. అమ్మాయి ఒక్కతే ఉంది. వచ్చిన వారిని గౌరవించి, తల్లిదండ్రులు వచ్చు సమయ మైనదని, కూర్చుండ వలసిందని చెప్పి గృహంలోనికి వెడుతుంది. వచ్చిన బంధువులకు ఆతిధ్యమిచుటకు ధాన్యమును రోటిలో వేసి దంచుతూ ఉంటుంది. అమ్మాయి చేతికి ఉన్న గాజులు శబ్దం చేస్తుంటాయి. ఆ గాజుల శబ్దం విని ఈ ఇంట్లో వడ్లు దంచుటకు కూలీలను విన్యోగించే శక్తికుడా లేదని తెలుసుకుని తద్వారా తన ఇంటి పేదరికాన్ని వచ్చిన చుట్టాలు గ్రహిస్తారనే ఉద్దేశ్యము తో తన చేతి గాజులన్ని పగుల గొట్టి ఒక్కొక్క చేతికి రెండేసి గాజుల చొప్పున ఉంచుకుంటుంది. అప్పటికీ శబ్దము జనిస్తూనే ఉంటుంది . రెండవ గాజును కుడా పగులగొట్టి చేతికి ఒక గాజు చొప్పున ఉంచుకుంటుంది. ఇక శబ్దము రాలేదు . ఆవిడ తన పనిలో నిమగ్నమౌతుంది. సన్యాసికి జన సంసర్గం మంచిది కాదనియు , ఇద్దరున్నను గొడవలే ననియు, ఏకాంత జీవనమే శ్రేయోదాయకమనియు ఆ అమ్మాయిని చూచి గ్రహించాను.
24. తుమ్మెద కీటకమును తెచ్చి తన గూటిలో ఉంచి పొడుస్తూ ఉంటుంది. మళ్ళీ తుమ్మెద ఎప్పుడు వస్తుందో, మళ్ళీ తనను భయంకరముగా కాటు వేస్తుందేమో అనే భీతితో సదా ఆ కీటకము భ్రమరాన్ని గూర్చే చింతిస్తూ ఉంటుంది. అనవరతము భ్రమర ధ్యానంలో ఉన్నందున ఆ కీటకము భ్రమరంగా మారి పోతుంది."యద్భావం తద్భవతి" భావాలే బ్రతుకును నిర్ణయిస్తాయి. నిరంతరం ఆత్మ ధ్యానంతో నేనూ ఆత్మ జ్ఞానినై పోవాలని దేహ భ్రాంతిని వదలి మోక్ష సామ్రాజ్యాన్ని సాధించాలని ఈ భ్రమర కీటకములు చూసి నేర్చుకున్నాను. దీనినే భ్రమరకీటక న్యాయమంటారు.
దత్తాత్రేయులవారి ద్వారా పై సత్యాలను గ్రహించిన యదు మహారాజు సంతృప్తిని చెందినవారై సంసారాన్ని త్యజించి తదేకముగా భగవత్ ధ్యానములో శేష జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు.
దత్తాత్రేయులవారు తనకు లభ్యమయ్యే ప్రతిచోటనుండి జ్ఞానాన్ని సముపార్జించారు. సాధకులెప్పుడూ ఎవరి నుండి జ్ఞానము ప్రసరించినా దానిని గ్రహించడం అలవరచుకోవాలి.
ఓం తత్ సత్
"అవధూత గీత " స్వామి సుందర చైతన్యానందుల వారి దివ్య సౌజన్యముతో …